వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడే నిరంతరంగా ప్రయత్నాలు చేయాలని ఆయన ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను బోట్ల ద్వారా కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలకు తరలించాలని తెలిపారు. తరలించేందుకు బస్సులు సిద్ధం చేయాలని తెలిపారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు. బాధితులకు ఆహార పంపిణీపై సిఎం అరా తీయగా సుమారు లక్షన్నర మంది వరకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. గండిని పూడ్చగలిగామని సీఎంకు అధికారులు వివరించారు. కరకట్ట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు.