ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ కు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. పాస్ పోర్ట్ రెన్యూవల్ విషయంలో జగన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆయన పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు, రెన్యూవల్ టైమ్ ను ఐదేళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు అడ్డు తొలగినట్లైంది. ఏపీలో అధికారం కోల్పోయాక జగన్ కు అప్పటి వరకున్న డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ నిబంధనల మేరకు రద్దయింది. దీంతో జనరల్ పాస్ పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్ట్ కాలపరిమితిని ఏడాదికి కుదించడంతో పాటు పలు షరతులు విధించింది. దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఐదేళ్ల గడువుతో జగన్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని తీర్పు చెప్పింది.