శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సమీపంలోని పంటపాలెం వద్ద ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పరిసర ప్రాంతాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కృష్ణపట్నం, నెల్లూరు నుండి ఎనిమిది ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టమ్మీద మంటలను ఆర్పాయి. సింగపూర్, మలేషియా నుండి ఓడల ద్వారా క్రూడ్ పామాయిల్ కృష్ణపట్నం పోర్టుకు వస్తుంటుంది. అక్కడి నుంచి పంటపాలెంలోని ఎనిమిది పామాయిల్ ఫ్యాక్టరీలకు పైపుల ద్వారా సరఫరా అవుతుంటుంది. ఆయిల్‌ను శుద్ధి చేసి ప్యాకెట్లు, డ్రమ్ముల ద్వారా మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. ఇక్కడ జరిగిన ప్రమాదం స్థాయి పూర్తి వివరాలు తెలియలేదు. బాయిలర్ పేలిందా? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా? ప్రమాద ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలపై ఫ్యాక్టరీ యాజమాన్యం నోరు విప్పడం లేదు.