అకాల వర్షాలు వల్ల మళ్ళీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు విరుచుకుపడింది. వరద ఉధృతి తగ్గడంతోఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలేనని రైతులు అంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్.. అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు లోకేష్ బయలుదేరి వెళ్లారు. మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ రోజు వరద బాధితులకు ఉదయమే ఇళ్లకు వెళ్లి 1200 మంది టీడీపీ కార్యకర్తలు టిఫిన్, పాలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అకాల వర్షాల వల్ల మళ్ళీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మైలవరం, ఎగువ ప్రాంతమైన ఖమ్మం ఏరియాలో వర్షాలు పడటం వల్ల బుడమేరుకు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. కొండపల్లి శాంతినగర్ ఎర్రబడ్జి వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తెగిందన్నారు. దయచేసి చెరువుల గండ్లను తక్షణమే పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. అలానే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తను గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్నానని, జక్కంపూడి కాలనీలోని వరద బాధితులకు ఆహారాన్ని పంపించే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. అత్యవసరమైతే తనకు ఫోన్ చేయాలని వసంత కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.