భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. నిన్న విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా… ప్రస్తుతం 9.5 క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని చెప్పారు. మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్రరూపం దాల్చించి. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వదర నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది.