గౌతం అదానీ, సెబీ చీఫ్ మాధబీపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్స్‌లో సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురికి వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల ప్రభావం సోమవారం ఉదయం స్టాక్ట్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. దాంతో అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 17 శాతం మేర నష్టాల్లో కొససాగుతోంది. అదానీ టోటల్ గ్యాస్ 13.39 శాతం, ఎన్‌డీటీవీ 11 శాతం, అదానీ పవర్ 10.94 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ 6.96 శాతం, అదానీ విల్మార్ 6.49 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.43 శాతం మేర పడిపోయాయి. అటు అదానీ పోర్ట్స్ 4.95 శాతం, అంబుజా సిమెంట్స్ 2.53 శాతం, ఏసీసీ 2.42 శాతం మేర పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.