శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరిగింతో అర్థంకాక ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. అసలే జలశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఏడో నంబర్ యూనిట్‍లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అనంతరం సమస్యను గుర్తించిన అధికారులు సాంకేతిక లోపం తలెత్తి శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. కండెన్సర్ కాలిపోయి పేలుడు సంభవించినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన విద్యుత్ ఉత్పత్రి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 99,615క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,81,235క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలాశయం 6గేట్లు 10అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50అడుగులకు చేరుకుంది.