వర్షాలతో ఉత్తరాంధ్ర వణికింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడతవలసకు వెళ్లే మార్గంలోని సెట్టిగెడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్‌ను స్థానికులు రక్షించారు. విశాఖపట్టణం జిల్లాలోని గోపాలపట్నంలో కొండచరియ విరిగిపడింది. ఈ ఘటనలో రెండు ఇళ్లు దెబ్బతిని ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లను ఖాళీ చేయించారు.