ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్‌లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థుల ఆందోళనలు
కొత్త వలస పాలసీతో 25 శాతం మేర తగ్గనున్న శాశ్వత నివాస నామినేషన్లు
కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వలస విధానంపై ఆ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, ఎన్‌డీటీవీ నివేదిక ప్రకారం ప్రస్తుతం కెనడా తెచ్చిన కొత్త వలస విధానంతో దాదాపు 70వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమను వెనక్కి పంపుతారనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దాంతో వాళ్లు ఆందోళనలకు దిగుతున్నారు.
ఇక అంతర్జాతీయ విద్యార్థులు, మరీ ముఖ్యంగా భారతీయులు మంచి భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీ మొత్తంలో వలస వెళ్తుంటారు. అందులో అమెరికా, కెనడాకు వెళ్లడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, కెనడా నూతన వలస విధానం ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్‌లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంపు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గడిచిన మూడు నెలలుగా ఈ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఆందోళనలే ఆంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాల్లోనూ జరుగుతున్నాయి.
ఇక కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు కూడా పరిమితమవుతాయి. దాంతో భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని తెలుస్తోంది.
కాగా, కెనడా కొత్త వలస విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఆ దేశంలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరగడమే. ఎంతగా అంటే గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97 శాతం మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఉన్నట్లు ఫెడరల్ డేటా తెలిపింది. ఇలా జనాభా విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
అటు సర్వేల్లో ట్రూడో పట్ల వ్యతిరేకత పెరిగినట్లు తేలింది. దాంతో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై పరిమితి విధిస్తూ ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి స్వస్తి పలికింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కెనడా 2023లో అత్యధికంగా 1,83,820 విదేశీ తాత్కాలిక వర్క్ పర్మిట్లను జారీ చేసింది. 2019తో పోలిస్తే అది 88 శాతం అధికం. అయితే కొత్త విధానంతో ఈ ఏడాది ఈ పర్మిట్లకు భారీగా కోత పడింది. ఈ కొత్త పాలసీ ప్రకారం నిరుద్యోగిత రేటు 6 శాతం కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తారు. అయితే, వ్యవసాయం, ఆహార శుద్ధి, నిర్మాణ, ఆరోగ్య రంగాలకు దీని నుంచి మినహాయింపు నిచ్చారు. వచ్చే మూడేళ్లలో మొత్తం దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాలని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా పలు చర్యలకు ఉపక్రమించింది ట్రూడో సర్కార్.