తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. లడ్డూలో జంతువుల కొవ్వు, పంది నెయ్యి కలిపారనే అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే అంశంపై ఏపీలో అధికార టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు. ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురి పిటిషన్లు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థన. ఎన్డీబీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. పిటిషన్‌లో స్వయంగా వాదనలు వినిపించనున్న సుబ్రహ్మణ్యస్వామి. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్లు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎక్కడిదని ప్రశ్న. ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా లేదా అనేది తేల్చాలని పిటిషన్‌లో వినతి. తప్పుడు ఆరోపణలతో తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వాదనలు. ఎస్ఓపి ప్రకారం పరీక్షల్లో నెగ్గిన నెయ్యిని తిరుమల ప్రసాదానికి వాడటం దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానం. ఓ చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని్ణ పిటిషనర్లు కోరారు.