గర్భం ధరించే సమయంలో 80 శాతం మందికిపైగా మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. సాధారణంగా గర్భం ధరించే సమయంలో మహిళలకు ఐరన్ చాలా అవసరం. పెరుగుతున్న పిండం అభివృద్ధి చెందేందుకు సాధారణంగా ఉండాల్సిన ఐరన్‌తో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ అవసరమవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ శరీరం ఎక్కువ ఐరన్‌ను శోషించుకుంటుంది. అయితే దాదాపు 50 శాతం మంది మహిళలు గర్భం ధరించే సమయంలో అతి తక్కువ ఐరన్ కలిగి ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. ఇనుము వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో మాత్రమే కాదు.. ఆశ్చర్యకరంగా ఎక్కువ వనరులు ఉన్న దేశాల్లోనూ 33-42 శాతం మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారట. శరీరంలో ఐరన్ లోపం రక్త హీనతకు దారితీస్తుంది. దీనివల్ల సరిపడా హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో శరీరం ఇబ్బందిపడుతుంది. ఫలితంగా శరీరమంతా ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లీపిల్లలు ఇద్దరికీ ముప్పుగా పరిణమిస్తుందని అధ్యయనం వెల్లడించింది. ఐరన్ లోపం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, బరువు తక్కువగా ఉండడం, దీర్ఘకాలంగా న్యూరోడెవలప్‌మెంట్ సమస్యలు వెంటాడతాయని అధ్యయనకారులు తెలిపారు.