వైసీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం తిరుమలకు వెళుతున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు, క్రైస్తవుడైన జగన్ అందరు అన్యమతస్తుల మాదిరే శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై సంతకం చేయాలని స్వామీజీలు, హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆయనను శ్రీవారి దర్శనానికి పంపించాలని అంటున్నారు. టీటీడీ కూడా జగన్ కోసం డిక్లరేషన్ ఫామ్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి ముందే… ఆయన బస చేసిన అతిథిగృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫామ్ పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్టు చెపుతున్నారు. ఓవైపు ఇంత జరుగుతున్నా… డిక్లరేషన్ పై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో, జగన్ డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.