విదేశీ విద్యార్థులను మరింత తగ్గించనున్నట్లు ప్రకటించిన కెనడా
2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం తగ్గింపు అంటూ ఐఆర్‌సీసీ ప్రకటన
కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు ఝలక్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థులను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2025లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 10 శాతం తగ్గించడం జరుగుతుందని ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వం కెనడా (ఐఆర్‌సీసీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2024లో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 4,85,000 నుండి 10 శాతం తగ్గితే కేవలం 4,37,000 మందికి మాత్రమే స్టడీ పర్మిట్‌లు అందుతాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇక 2025లో జారీ చేసే స్టడీ పర్మిట్‌ల సంఖ్య 2026లో కూడా అలాగే ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ ఏడాది జనవరిలో దాదాపు 3,60,000 అండర్‌గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్‌లను ఆమోదించనున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది 2023లో జారీ చేయబడిన 5,60,000 స్టడీ పర్మిట్లతో పోలిస్తే దాదాపు 35 శాతం తగ్గింపునకు సమానం.కెనడా జనాభా 2024 మొదటి త్రైమాసికంలో 41 మిలియన్ల మందిని అధిగమించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల నేపథ్యంలో ఐఆర్‌సీసీ కీలక ప్రకటన చేసింది. తాత్కాలిక నివాసితుల సంఖ్యపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా 2026 నాటికి కెనడా మొత్తం జనాభాలో 6.5 శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.