రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? అంటే అందుకు తొందరపడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతుండటంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల ఉన్నాయి. దీంతో భారత్ కూడా వడ్డీ రేట్లను తగ్గించవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024లో పాల్గొన్న శక్తికాంతదాస్ మాట్లాడుతూ… ఇటీవలి కాలంలో ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించేందుకు తాము తొందరపడటం లేదన్నారు. ద్రవ్యోల్భణం 2-6 శాతం మధ్య ఉంచాలన్న తమ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. అయితే తమ లక్ష్యం 4 శాతంగా ఉందన్నారు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలలోనూ దీనిపై చర్చించామన్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపుపై తొందరపాటు లేదని, ఇతర కేంద్రబ్యాంకులు కూడా ఈ అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశీయ వృద్ధిలో ప్రైవేటు వినియోగం, పెట్టుబడులది కీలకపాత్ర అన్నారు. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం నుంచి బయటపడి వేగంగా పుంజుకుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ రుణాలు పెరగడంపై శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు.