పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్న హైకోర్టు
7 వేల మంది అక్కడికి కాలినడకన రాలేరని వ్యాఖ్య
144 సెక్షన్ విధించకుండా పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీత
ఇలాంటి పరిస్థితుల మధ్య వైద్యులు ఎలా పనిచేస్తారని ప్రశ్న
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో నిన్న జరిగిన విధ్వంసంపై కోల్‌కతా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిని దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. పోలీసులు కూడా తమను తాము రక్షించుకోలేకపోతున్నారని, అలాంటప్పుడు వైద్యులు భయం లేకుండా ఎలా పనిచేయగలుగుతారని ప్రశ్నించారు.
ఈ ఘటనపై ప్రభుత్వాన్ని మందలించిన న్యాయస్థానం.. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారని, మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అసాధ్యమని అభిప్రాయపడింది. వైద్యులు తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.