ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వరద కొల్లేరుకు పోటెత్తడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కొల్లేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం మండవెల్లి పరిసర ప్రాంతాలతోపాటు కైకలూరు-ఏలూరు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. ఏలూరు మార్గంలో రెండు అడుగుల మేర నీరు ఉంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. కొల్లేరుకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి ఆ నీరు చేరాలి. ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో అక్రమ చెరువు గట్లు అడ్డుపడుతున్నాయి. వరదల సమయంలో కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్ర కాల్వల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఇలా చేరిన నీరు కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే దిగువకు చేరుతోంది. నేడు ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఇప్పటికే ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెద్ద యడ్లగాడి-పెనుమాకలంక రోడ్డుకు బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు, ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.