ఆర్జీ కర్ ఆస్పత్రి ట్రయినీ వైద్యురాలిపై హత్యాచారం విషయంలో న్యాయం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలతో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. దీనికి తెరదించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు జూనియర్ వైద్యులు శుక్రవారంనాడు లేఖ రాశారు. నేర తీవ్రత, దానిని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పని ప్రాంతాల్లో భయాలు నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యావద్దేశం నిష్పాక్షికమైన సత్వర విచారణను కోరుతోందని వైద్యులు తమ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ప్రజలు సమష్టిగా తమ భావోద్వేగాలను వెల్లడించేందుకు, బాధితురాలికి సంఘీభావం తెలిపేందుకు, న్యాయం కోరుతూ ఆగస్టు 15వ తేదీన నగరాలు, పట్టాణాలు, గ్రామాల్లో సైతం క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారని వివరించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొందరు అల్లరిమూక ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోకి చొరబడి క్యాంపస్‌పై దాడి చేసి ఎమర్జెన్సీ వార్డును ధ్వంసం చేశారని, ఘటన జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరిగిందని, ఇంత జరుగుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని, గూండాల భయానికి వైద్యులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెట్టారని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
ఇలాంటి భయానక, నమ్మకం కోల్పోయిన, నిస్సహాయ స్థితిలో జూనియర్ వైద్యులు గత్యంతరం లేని పరిస్థితిలో ఆసుపత్రి ఆవరణలో పనులకు దూరంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా పౌరులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. అభయ క్లినిక్స్ పేరుతో పబ్లిక్ గ్రౌండ్స్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ వైద్యశిబిరాలను డబ్ల్యూబీజేడీఎఫ్ నిర్వహిస్తోంది. ఉచితంగా హెల్త్ కేర్ సేవలను కొనసాగిస్తోంది. న్యాయం-వైద్యం సమ్మెకు వెళ్లకూడదంటూ భారత ప్రధాన న్యాయమూర్తి మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని అవరోధాలు ఎదురైనా విధి నిర్వహణను వైద్యులు కొనసాగిస్తున్నారు అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు.
తాజా నివేదకకు సుప్రీం ఆదేశం
ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రయినీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో దర్యాప్తునకు సంబంధించిన తాజా నివేదికను సెప్టెబర్ 17వ తేదీన తమకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నియమించిన మూడు సీఐఎస్ఎఫ్ కంపెనీలకు వసతి కల్పించాలని కూడా పశ్చిమబెంగాల్ హోం శాఖ సీనియర్ అధికారులు, సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.