బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నేడు తెలిపింది. పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండం గా మారనుందని ఐఎండి పేర్కొంది..
ఏపీలో వర్షాలు
దీంతో నేటి నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో అనేక జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది. అయితే ఈరోజు మాత్రం ఏపీలో అనేక జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
- నేడు ఈ జిల్లాలలో వర్షాలు
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలకురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో గోదావరి నదికి వరద
ఇక అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఏపీలో గోదావరి నదికి వరద కొనసాగుతుంది. అయితే వరద ఉధృతి కాస్త తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి కి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి స్థిరంగా కొనసాగుతుంది.
కృష్ణా నదికి వరదలు
అయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి మళ్ళి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక మరోవైపు కృష్ణా నదికి వరద కొనసాగుతున్న క్రమంలో శ్రీశైలంలో ఉన్న 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ లోనూ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు..