కరోనా మహమ్మారి.. యావత్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో భయపెట్టిందో మనందరం కళ్లారా చూశాం. అయితే ఇదే సమయంలో ప్రపంచాన్ని మంకీపాక్స్ భయపెడుతోంది. ప్రపంచ దేశాల్లో క్రమంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్ వైరస్ కారణంగా మరోసారి లాక్‌డౌన్ తప్పదనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాల్లో చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న ఈ మంకీపాక్స్ వైరస్‌కు చికిత్స లేకపోవడంతో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ పట్ల ప్రపంచ దేశాలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు మన ఆసియా ఖండంలోకి విస్తరించింది. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో భారత్‌లోనూ తీవ్ర ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అడ్వైజరీలు జారీ చేసింది. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అయితే గతంలోనూ ఈ మంకీపాక్స్ వైరస్ ఉన్నా.. ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒకప్పుడు మంకీపాక్స్‌గా పిలిచిన ఈ వైరస్‌ను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇటీవల ఎమ్‌పాక్స్ అని పేరు మార్చింది. ఈ ఎమ్‌పాక్స్ సోకి ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికా ఖండం అంతటా ఈ మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఇది ఇతర ఖండాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇప్పటివరకు ఆఫ్రికాలో 14 వేల కంటే ఎక్కువ కేసులు.. 524 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే మంకీపాక్స్ కేసులు, మరణాలు ఈసారి భారీగా పెరిగిపోయాయని.. డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇక ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఈ ఎమ్‌పాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ఎమ్‌పాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేయడం సహా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరోసారి ప్రపంచంలో లాక్‌డౌన్లు విధించే అవకాశాలు లేకపోలేదని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.