బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అమెరికా ప్రభుత్వం వీసాను రద్దు చేసిందని జరిగిన ప్రచారంపై ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ స్పందించారు. తన తల్లి ఏ దేశంలోనూ ఆశ్రయం కోరలేదని వెల్లడించారు. తన తల్లికి ఆశ్రయం ఇచ్చే విషయంలో అమెరికా, బ్రిటన్ స్పందించడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన తల్లి ఆశ్రయానికి సంబంధించి మీడియాలో వివిధ కథనాలు వస్తున్నాయని, కానీ వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తన తల్లి అసలు ఏ దేశం ఆశ్రయం కోరలేదు కాబట్టి అమెరికా, బ్రిటన్ దేశాలు స్పందించలేదని చెప్పడం సరికాదన్నారు. తన తల్లికి ఆశ్రయంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఇదిలావుంచితే, భారత్ నుంచి బ్రిటన్ వెళ్లి తాత్కాలిక ఆశ్రయం పొందాలని షేక్ హసీనా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్నిరోజులు ఆమె భారత్‌లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షేక్ హసీనా సోదరి రెహానా కూతురు తులిప్ సిద్దీఖ్ బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. అందుకే షేక్ హసీనా యూకే వెళ్లాలని భావిస్తున్నారు. అయితే నిన్న బ్రిటన్ హోంమంత్రి మాట్లాడుతూ, శరణార్థిగా వచ్చే వారికి తమ చట్టాలు అంగీకరించవని, అంతర్జాతీయ రక్షణ కోరేవారు తొలుత చేరుకున్న దేశంలోనే ఆశ్రయం అడగాలని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో షేక్ హసీనాకు అమెరికా వీసా రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హసీనా తనయుడు స్పందించారు.