తమిళనాడులోని 11 ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదం కుట్ర కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది. చెన్నై, పుదుకొట్టై, కన్యాకుమారిల్లో సోదాలు జరుగుతున్నాయి. హిజ్ ఉత్ తహిర్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ ఈ తనిఖీలు చేపట్టింది. కాగా, కొంతకాలం కిందట తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ వారిచ్చిన సమాచారంతో ఇటీవల తరచుగా దాడులు నిర్వహిస్తోంది. తాజాగా, తమిళనాడులోని తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతాల్లో ఐసిస్ సానుభూతిపరులన్న అనుమానంతో సోదాలు చేపట్టింది. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. సోదాలు నిర్వహించిన సందర్భంగా ఇద్దరు అనుమానితుల నుంచి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.