ఒలింపిక్ వీరుల మధ్య కూర్చున్న రాహుల్‌గాంధీ
ప్రతిపక్ష నేత హోదాలో హాజరు
ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అందరి దృష్టిని ఆకర్షించారు. తెల్లని కుర్తా ధరించి వేడుకలకు హాజరైన ఆయన ఒలింపిక్ వీరులు మనూ భాకర్, సరజ్‌బోత్ సింగ్, ఆర్పీ శ్రీజేశ్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తదితరులతో కలిసి కూర్చున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసరమైనన్ని స్థానాలను ప్రతిపక్ష పార్టీలేవీ సాధించలేకపోయాయి. ఫలితంగా 2004 నుంచి 2024 వరకు ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను దక్కించుకోవడంతో లోక్‌సభలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. దీంతో జూన్ 25న ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అదే హోదాలో నేడు స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. ఫలితంగా పదేళ్ల తర్వాత ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న నేతగా రాహుల్ నిలిచారు.