ఆసుపత్రి మాజీ చీఫ్ పై అవినీతి ఆరోపణలు
ప్రత్యేక బృందంతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మాజీ చీఫ్ పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, ఆసుపత్రి మాజీ చీఫ్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన కార్యకలాపాలపై అధికారుల బృందం ఆరా తీయనుంది. మరోవైపు, వైద్యురాలి హత్యాచారం కేసులో సందీప్ ఘోష్ ను సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారు.
ఐజీ ప్రణవ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఆర్జీ కర్ ఆసుపత్రిలో విచారణ జరిపి నెల రోజుల్లోపు నివేదిక సమర్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైన డాక్యుమెంట్లను సిట్ బృందానికి సమర్పించి సిట్ బృందం విచారణకు సహకరించాలంటూ ప్రభుత్వం వివిధ డిపార్ట్ మెంట్లకు నోట్ పంపినట్లు తెలిపాయి. సందీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంటే.. 2021 జనవరి నుంచి ఆయన రాజీనామా చేసిన రోజు వరకు జరిగిన అన్ని ఆర్థిక వ్యవహారాలను సిట్ బృందం పరిశీలించనుంది.