ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘ జైలు శిక్ష వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ.. కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసు గురించి మాట్లాడవద్దని సూచించింది. రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలను విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం… సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పును వెలువరించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే, మరోపక్క సీబీఐ కేసు కూడా వున్న కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోయారు. ఇప్పుడు సీబీఐ కేసులోనూ బెయిల్ వచ్చింది.