టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో నిందితులుగా వైసీపీ నేతలు
48 గంటల్లో పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారులకు సరెండర్ చేయాలన్న న్యాయస్థానం
అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశం
తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. దర్యాప్తు అధికారుల విచారణకు సహకరించాలని అవినాశ్, జోగి రమేశ్‌లను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే దర్యాప్తు అధికారులకు ఇరువురు నేతలు 48 గంటల్లో తమ పాస్‌పోర్టులు సరెండర్ చేయాలని ఆదేశించింది.
దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 4న జరిగే తదుపరి విచారణలో వారి ముందస్తు బెయిల్‌పై సుప్రీం తేల్చనుంది.