మహిళా కమిషన్ విచారణకు కేటీఆర్ హాజరు
మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క- కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కేటీఆర్ ప్రకటన చేశారు. అయినప్పటికీ కమిషన్ నోటీసులు జారీచేయడంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు మహిళా కమిషన్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ట్యాంక్‌బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్‌ను మాత్రమే ఆఫీస్‌లోకి అనుమతించిన పోలీసులు బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అదేసమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపుచేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు బైఠాయించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.