ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్ దేనని అతిషి అన్నారు. సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం గా కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీని పక్కనపెట్టి మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు తనకు కూడా అంతే బాధగా ఉందన్నారు. ఎంతో కఠిన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెప్పారు. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై రాముడి చెప్పులు పెట్టుకుని ఎలా పాలన కొనసాగించాడో.. అదే విధంగా, రాబోయే నాలుగు నెలల పాటు తాను ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తానన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారని, ఢిల్లీ ప్రజలకు ఆయన నిజాయితీపై నమ్మకం ఉందని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్ కే చెందుతుందని, ప్రజలు మళ్లీ ఆయనను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.