. ఘాటైన విమర్శలతో మంత్రుల మూకుమ్మడి దాడి
. ఐ ప్యాక్‌తో ప్రశాంత్ కిశోర్‌కు సంబంధం లేదన్న జోగి
. రాజకీయ భిక్షగాడిగా అభివర్ణించిన అమర్నాథ్
. బీహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందన్న పేర్ని
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున నాయకులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో మరింత అలజడి సృష్టిస్తున్నాయి. కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాటి ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత క్రమంలో సీఎం జగన్‌కు దూరమయ్యారు. ఐ ప్యాక్ టీమ్‌ని కూడా పీకే వదిలేశారు. అయితే దేశంలోనే మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన పీకే… 2024 ఏపీ ఫలితాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. వైసీపీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఘోరంగా ఓటమి పాలు కాబోతుందని పీకే చెప్పారు. యువత ఎల్లవేళలా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోరుకుంటారని, ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తారని, దీనికి భిన్నంగా సీఎం జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత నివ్వడం వైసీపీ ఓటమికి కారణాలు కాబోతున్నాయని విశ్లేషించారు. డబ్బులు ప్రజల్లో అకౌంట్లలో నేరుగా వేసినంత మాత్రాన మళ్ళీ గెలిస్తే, ఏ ప్రభుత్వమూ ఓడిపోయే అవకాశం ఉండదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కాగా… సహజంగానే వైసీపీ అధిష్ఠానానికి తీవ్ర ఆగ్రహం కల్గించాయి. దీంతో అధినేత ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు పీకేపై ఘాటైన విమర్శలతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ప్రశాంత్ కిషోర్‌కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా? అతను సర్వేలెప్పుడు చేశాడు? ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఆయనను ఇప్పుడెవరూ పట్టించుకోరు. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నారంటూ మంత్రి జోగి రమేశ్ విమర్శలు గుప్పించారు.తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు తన సొంత రాష్ట్రం బీహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబే గెలుస్తాడనుకుంటే టీడీపీ మేనిఫెస్టోలో సంక్షేమం గురించి అది చేస్తా…ఇది చేస్తానంటూ ఎడాపెడా హామీలివ్వాలని ప్రశాంత్ కిశోర్ ఎందుకు సలహా ఇచ్చారని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఏపీలో అసలు సర్వే టీం లేని ప్రశాంత్ కిశోర్ డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెపుతారని ప్రశ్నించారు. బీహార్‌లో పీకే చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ డీల్‌లో భాగంగా చేస్తున్న ప్రకటనలను ఏపీలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ భారీ విజయం సాధించనున్నట్లు లగడపాటి రాజగోపాల్‌తో చంద్రబాబు జోస్యం చెప్పించారని, ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా తీవ్రస్థాయిలో పీకేపై విరుచుకుపడ్డారు. ఒక పీకే (పవన్ కళ్యాణ్) వల్ల కావడం లేదని, చంద్రబాబు ఇప్పుడు మరో పీకే (ప్రశాంత్ కిషోర్)ను తెచ్చుకున్నారని, ఎంత మంది పీకేలొచ్చినా జగన్‌ను ఏమీ పీకలేరని వారు వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ల మీద ట్వీట్‌లు చేస్తూ వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వెంట సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు ఉన్నాయని, టీడీపీ కేవలం ఒక కులానికి చెందిన పార్టీయేనని, చంద్రబాబు తాను, తన బంధువుల ప్రయోజనం మాత్రమే చూసుకుంటారని విమర్శించారు. ప్రశాంత్‌కిషోర్ నాలుగు గంటలపాటు చంద్రబాబుని కల్సిన తర్వాత ఆయన సంతృప్తి కోసం..లాజికల్ డేటా లేకుండా మాట్లాడారని పేర్కొన్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కోట్లాదిమంది పేద ప్రజలకు రక్షకునిగా నిలిచాయని గుర్తు చేశారు. ఇలా మొత్తానికి రాష్ట్రంలో ఏది జరిగినా, ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబుని అడ్డుపెట్టుకుని విమర్శలు గుప్పించే అధికారపార్టీ శ్రేణులు పీకే వ్యాఖ్యలపై కూడా ఇదంతా చంద్రబాబు సృష్టేనంటూ విమర్శలు గుప్పించారు.