కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో ఏడుగురు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైలులోపల దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని ఈ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో జైలు అధికారులలో ఏడుగురు దర్శన్ కు రాచమర్యాదలు చేస్తున్నట్లు గుర్తించామని, వారందరినీ వెంటనే సస్పెండ్ చేశామని హోంమంత్రి జి పరమేశ్వర మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాఫ్తు జరిపిస్తామని, ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.