రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో యూకే, అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను సమకూరుస్తున్నాయి. ఇలా అందుకున్న అత్యాధునిక క్షిపణులను రష్యాపైకి ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. తాజాగా యూకే అత్యాధునిక క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు అందజేసిందని, వాటిని రష్యాలోని పలు ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ఎక్కుపెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. రష్యాలోని ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయి అణు బాంబు ప్రయోగ సంసిద్ధతపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, రష్యా భూభాగంపై క్రూయిజ్ మిసైళ్లు పడితే అణుబాంబు ప్రయోగించాల్సి వస్తుందని పశ్చిమ దేశాలను సీరియస్ గా హెచ్చరించారు.
యుద్ధం మొదలై ఏడాది గడిచి పోయినా ఉక్రెయిన్ లొంగకపోవడం, రష్యన్ బలగాలను దీటుగా ఎదుర్కొంటూ ఎదురుదాడులు చేస్తుండడం వెనక పాశ్చాత్య దేశాలు ఉన్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ కు ఆయుధాలను ఇస్తూ రష్యాపై దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు. కిందటి వారం యూకే పలు క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు పంపించిందని, వాటి వినియోగానికి జెలెన్ స్కీకి అనుమతినిచ్చిందని సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు యూకే ప్రధాని కీవ్ స్టార్మర్ అమెరికాకు వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో పుతిన్ వెంటనే స్పందించారు. తమ భూభాగంపై క్రూయిజ్ మిసైల్ దాడి జరిగితే అణు బాంబు ప్రయోగిస్తామని పాశ్చాత్య దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.