ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి, సినీ నటులు మరియు రాజకీయ నాయకుల జాతకాలు వెల్లడించడం ద్వారా గత కొన్నాళ్లుగా పాప్యులర్ అయ్యారు. అయితే, ఇటీవల ఆయన చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తీవ్రంగా స్పందించాయి.
వేణుస్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణు స్వామిని ఈ నెల 22న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇది మొదటిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, అలాగే రాజకీయ ఫలితాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన జోస్యం తప్పడంతో అప్పట్లో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తరువాత, చైతన్య-శోభిత వివాహ నిశ్చితార్థం పై వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వివాదాస్పదం అయింది.