సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను ఈరోజు పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గతంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఎక్కుడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని… ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని… లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మీమీద లేదా? అని ప్రశ్నించారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన గురించి మాట్లాడారని… ఏం జరిగింతో తెలుసుకుని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే టూ వే అని… వన్ వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ప్రకాశ్ రాజ్ ను హెచ్చరించారు.