ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపు
విశాలాంధ్ర`గుంటూరు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగే ఆందోళనలకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 2, 3 తేదీలలో తలపెట్టిన దీక్షలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ పార్లమెంట్ సమీపంలో జరిగే ఆందోళనకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంఫీుభావ దీక్షలు చేపడుతున్నామని వెల్లడిరచారు. అంతేకాకుండా క్విట్ ఇండియా డే ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో ఈ నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజాసమస్యలపై ఆందోళన చేసే ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నదని ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రేపల్లెలో ఆక్వా చెరువు దగ్గర మరణించిన కార్మికులను పరామర్శించడానికి వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో ఆస్తి పన్ను తగ్గించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యమం చేస్తున్న సీపీఎం కార్యకర్తలను ఎమ్మెల్యే అంబటి రాంబాబు తొక్కుకుంటూ వెళ్లడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ఉద్యమకారులకు లేదా అంటూ నిలదీశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కును నరేంద్రమోదీ ప్రభుత్వ ఆదేశాలతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దొంగచాటుగా అమ్మే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అమ్మకానికి సహకరిస్తూ మరొవైపు విశాఖ ఉక్కు ఉండాలని రోడ్లపై ప్రదర్శనలు చేయడం నమ్మశక్యంగా లేదన్నారు. ఈ నెల 9వ తేదీన జరిగే సేవ్ ఇండియా కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి ముసునూరు రమేష్‌బాబు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.