డెమొక్రాట్లలో తిరుగుబాటుతోనే బైడెన్ ఔట్: మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు శక్తిమంతమైన అధ్యక్షుడు కావాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డెమొక్రాట్లతో తిరుగుబాటు రావడం వల్లనే జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాల్సి వచ్చిందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి తిరిగి అధ్యక్ష పీఠాన్ని అధీష్టించాలని సంకల్పించారు. ఇదే క్రమంలో ఆయన స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూకు బహుళ ప్రచారం లభించింది. అధ్యక్ష పదవికి పోటీదారులుగా బైడెన్‌తో జరిపిన చర్చలు (డిబేట్) తాను పాల్గొన్న గొప్ప చర్చల్లో ఒకటిగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. బైడెన్ తడబాటు వల్ల ఆయన తన అభ్యర్ధిత్వాన్ని కోల్పోయారన్నారు. ‘జో బైడెన్‌తో డిబేట్ నేను పాల్గొన్న గొప్ప చర్చల్లో ఒకటి. అందులో బైడెన్‌ను ఘోరంగా ఓడిరచా. ఫలితంగా ఆయనను ఆ పార్టీ అధ్యక్ష బరి నుంచి తొలగించింది. డెమొక్రాటిక్ పార్టీలో తిరుగుబాటు రావడం వల్లనే బైడెన్ తప్పుకోక తప్పలేదు’ అని స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్ గురించీ మాట్లాడారు. అధినేతలు తమ దేశ ప్రేమికులని ట్రంప్ అన్నారు. అయితే వారి ప్రేమ భిన్నమైనదిగా వర్ణించారు. ఇటువంటి నాయకులను ఎదిరించాలంటే అమెరికాకు శక్తిమంతమైన అధ్యక్షుడు అవసరమని అభిప్రాయపడ్డారు. బైడెన్ అధ్యక్షుడు కాకపోతేగనుక ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరిగేది కాదని మాజీ అధ్యక్షుడు అన్నారు. పుతిన్ తనను చాలా గౌరవిస్తారని, ఆయనతో అనేకసార్లు మాట్లాడానని, ఉక్రెయిన్ గురించీ చర్చించారని ట్రంప్ వెల్లడిరచారు. అదే సమయంలో పెన్సిల్వేనియాలో నిర్వహించిన ప్రచార సభలో తనపై హత్యాయత్నాన్ని ప్రస్తావించారు. తృటిలో ప్రాణాలతో బయట పడ్డానని, బుల్లెట్ చెవికి తగిలిందని, అదే చివరి క్షణంగా తోచిందని, బుల్లెట్ దూసుకెళ్లడం తెలిసిందని ఆయన చెప్పారు.