కాల్పుల విరమణకు నెతన్యాహు నిరాకరణ
టెల్‌అవీవ్: పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి తారస్థాయికి చేరడంతో అమెరికాతోపాటు ఫ్రాన్స్ జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించడం లేదు. అమెరికా, ఫ్రాన్స్ 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయిల్ తిరస్కరించింది. హెజ్బుల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దుల్లో చోటుచేసుకున్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని చెప్పుకొచ్చింది. ‘ఉత్తరాదిలో చోటుచేసుకున్న సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదే హెజ్బుల్లాను అంతం చేయడం’ అని ఇజ్రాయిల్ రెవెన్యూశాఖ మంత్రి స్మోట్రిచ్ వెల్లడిరచారు. అమెరికా, ఫ్రాన్స్ చెప్పినట్లుగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే హెజ్బుల్లా కోలుకునేందుకు సమయం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు బుధవారం రాత్రి బెకా వ్యాలీ, దక్షిణ లెబనాన్‌లోని సుమారు 75 హెజ్బుల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ వెల్లడిరచింది. ఫైర్ లాంచర్లు, ఆయుధ భాండాగారాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతకుముందు ఇజ్రాయిల్-లెబనాన్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లెబనాన్ ప్రధాని నజీబ్ స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇజ్రాయిల్-హెజ్బుల్లా మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా, ఫ్రాన్స్ తీవ్రంగా ప్రయత్నించాయి. 21 రోజుల పాటు కాల్పుల విరమణకు రెండు వర్గాలు అంగీకరించాలని తీర్మానించాయి. దీనికి యూరోపియన్ యూనియన్‌తోపాటు కొన్ని అరబ్ దేశాలు మద్దతు పలికాయి. వెంటనే దీనిని అమలు చేసేలా రెండు వర్గాలు కార్యాచరణ ప్రారంభించాలని కోరాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణకు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ‘గత ఏడాది అక్టోబరు 7న మొదలై, ముఖ్యంగా రెండు వారాల క్రితం నుంచి జరుగుతున్న కాల్పుల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పౌరులకు ఇవి శరాఘాతంగా మారుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించి సాధారణ పౌరులంతా వాళ్ల స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పించాలి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైమానిక దాడులతోపాటు లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై భూతల దాడులు చేసేందుకు ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని ఆ దేశ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ప్రకటించడంతో అగ్రదేశాలు ఈ ప్రకటన చేశాయి. మరోవైపు, యుద్ధం ఆపొద్దని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. అమెరికా, ఫ్రాన్స్ సంధి ప్రతిపాదనలపై నెతన్యాహు స్పందించలేదని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పూర్తిస్థాయి దళాలతో హెజ్బుల్ల్లాతో పోరాటం చేయాలని నెతన్యాహు ఆదేశించినట్లు పేర్కొంది.