లెబనాన్‌లో 100 మంది మృతి
జెరుసలేం/బీరుట్: ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయిల్ వరుసదాడులతో విరుచుకుపడుతోంది. సోమవారం లెబనాన్‌లో 300 హెజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం ఎక్స్ వేదికగా వెల్లడిరచింది. ఈ దాడులకు చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ అనుమతి ఇచ్చారని చెప్పింది. ఈ దాడుల్లో 100 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. అయితే ఈ దాడులను లెబనాన్ ప్రధాని తీవ్రంగా ఖండిరచారు. లెబనాన్ గ్రామాలు, పట్టణాలను ధ్వంసం చేయడమే ఇజ్రాయిల్ విధ్వంసకర ప్రణాళిక లక్ష్యంగా కనిపిస్తోందని తన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మండిపడ్డారు. ఈ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు పెద్ద దేశాలను కోరారు. కాగా, తూర్పు, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ చేస్తోన్న దాడులతో చాలామంది గాయపడ్డారు. దాడులు విస్తృతమవుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో వారికి వెంటనే చికిత్స అందించే లక్ష్యంతో అత్యవసరం కాని సర్జరీలు నిలిపివేయాలని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఆసుపత్రులకు సూచనలు చేశారు. మరోవైపు, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన పోరు ఇటీవల తీవ్రరూపం దాల్చింది. దాడులకు ముందు దక్షిణ లెబనాన్‌లోని స్థానికులకు ఇజ్రాయిల్ హెచ్చరికలు చేసింది. ఆ ప్రాంతంలో హెజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు ఇజ్రాయిల్ సూచించింది. ఈ ఏడాదికాలంలో ఈ తరహా హెచ్చరిక రావడం ఇదే తొలిసారి. అనంతరం భారీగా దాడులు చేపట్టింది. ఇదిలా ఉంటే… మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు, తర్వాత లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ భవనంపై శుక్రవారం జరిపిన దాడి… హెజ్బుల్లాను భారీగా దెబ్బతీసింది. అందులో 16 మంది కీలక కమాండర్లను ఆ గ్రూప్ కోల్పోయింది. రద్వాన్, అబ్బాస్ బ్రిగేడ్స్… హెజ్బుల్ల్లాలోని రెండు కీలక దళాలు. ఉత్తర ఇజ్రాయిల్‌లోని హగాలిల్‌లో నిర్వహించాల్సిన ఓ సైనిక ఆపరేషన్ గురించి చర్చించడానికి శుక్రవారం ఈ దళాలకు చెందిన సీనియర్ కమాండర్లు సమావేశమయ్యారు. ఇందుకోసం దక్షిణ బీరుట్‌లోని ఓ భవనం కింద సొరంగాన్ని ఎంచుకున్నారు. ఇది జనావాసాల మధ్య ఉంది. ఈ భవనంలో హెజ్బుల్లా ఎన్నడూ సమావేశం కూడా కాలేదు. దీంతో ఎవరికీ ఈ భేటీ గురించి తెలిసే అవకాశం ఉండదని హెజ్బుల్లా భావించింది. ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొస్సాద్ మాత్రం ఈ కీలక కమాండర్ల సమావేశ వివరాలు సేకరించింది. హెజ్బుల్లా శ్రేణుల్లోకి మొస్సాద్ చొచ్చుకుపోయిందనడానికి ఈ దాడే నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమైంది.