లెబనాన్ ప్రభుత్వం వెల్లడి
బీరుట్: ఇజ్రాయిల్ దళాలు ఆదివారం జరిపిన వైమానిక దాడిలో 105 మంది మృతి చెందారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయపడ్డారని వెల్లడిరచింది. హెజ్బుల్లా` ఇజ్రాయిల్ మధ్య దాడుల కారణంగా దాదాపు 10 లక్షల మంది పౌరులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి ఉంటారని లెబనాన్ ప్రధాని తెలిపారు. లెబనాన్ చరిత్రలోనే ఇంత మంది తరలివెళ్లడం తొలిసారని చెప్పారు. ఇప్పటివరకు హెజ్‌బొల్లా స్థావరాలపైనే దాడులు చేసిన ఇజ్రాయిల్ వైమానిక దళం తొలిసారి రాజధాని బీరుట్‌లోని నివాసాలపై బాంబులు ప్రయోగించింది. కోలా జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌పై జరిపిన దాడిలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. హెజ్బుల్లా ఉగ్రవాదులు నివాస సముదాయాల్లో తమ ఆయుధాలు, క్షిపణులను దాచిపెట్టారని, వాటిని నిర్వీర్యం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)ప్రకటించింది. ప్రజలు ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు మృతి చెందారని ‘‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’’ ప్రకటించింది.