ఇస్లామాబాద్: పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు తీర్పుపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి సరిగా లేదని, శ్రీలంకలా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, బలహీన ప్రభుత్వం కాదని పాక్ సుప్రీం కోర్టు అభిప్రాయ పడిరది. ఈలోపు జాతీయ భద్రతా సమాఖ్య(ఎన్‌ఎస్‌సీ) సమావేశ వివరాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇమ్రాన్ సర్కార్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ వాడీవేడిగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాక్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 95ను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి రూలింగ్ ప్రాథమికంగా ఆర్టికల్ 95 ఉల్లంఘన అని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ పేర్కొన్నారు. ఈ కేసుపై ఈరోజు వరుసగా ఐదో రోజు విచారణ జరిగింది.