పెరుగుతున్న మద్దతు… తాజాగా బ్రిటన్ అంగీకారం
ఐరాస: ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఇందుకోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి బ్రిటన్ వచ్చి చేరింది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ… ఐరాస భద్రతా మండలిలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించాలని చెప్పారు. ‘భద్రతా మండలిలో తగినన్ని సభ్యదేశాలు లేనంతవరకూ ప్రతిపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగడం కష్టం. కాబట్టి భద్రతామండలిని మరింత పటిష్టం చేయాలి. ఇందులో భాగంగానే శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్య పెంచాలి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి’ అని అన్నారు. అంతకుముందు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రన్ సానుకూలంగా స్పందించారు. జనరల్ అసెంబ్లీలో మక్రాన్ ప్రసంగిస్తూ…భద్రతా మండలి విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.