15 మంది సజీవ సమాధి
జకార్త: ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ప్రావిన్స్‌లో బంగారు గని శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది సజీవ సమాధి అయ్యారు. తప్పిపోయిన మరో ఏడుగురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇండోనేసియాలో అక్రమ మైనింగ్ పరిపాటిగా మారింది. రక్షణ చర్యలు లేకుండానే డబ్బు ఆశ చూపి అక్రమార్కులు పనులు చేయించుకుంటున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టిన దీపంలా మారాయి. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే భారీ వర్షాల వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఇండోనేసియాలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి సోలోక్ జిల్లాలోని అక్రమ గని కూలిపోయిందని ప్రావిన్షియల్ డిజాస్టర్ ఏజెన్సీ అధిపతి ఇర్వాన్ ఎఫెండి తెలిపారు. గనిలో చిక్కుకుపోయిన మృతదేహాలు, క్షతగాత్రులను బయటకి తీసుకురావడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకోవడానికే 8 గంటలపాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందని అధికారుల బృందంలోని ఓ సభ్యుడు తెలిపారు. ఈ లోపు క్షతగాత్రుల పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబ సభ్యులు కనిపించట్లేదని ఇప్పటికే కొంతమంది ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగినప్పుడు గనిలో 25 మంది వరకు ఉన్నారని, 15 మంది మరణించారని, ముగ్గురు తీవ్రంగా గాయపడగా… ఏడుగురు ఆచూకీ లభించట్లేదని అధికారులు వెల్లడిరచారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు.