ఎయిర్‌పోర్ట్ యూనియన్ వర్కర్ల సమ్మె ` నిలిచిన విమాన సేవలు
నైరోబి: కెన్యాలో అదానీ సంస్థపై వ్యతిరేకత పెరుగుతోంది. దేశ రాజధాని నైరోబిలోని ముఖ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లీజు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వానికి, అదానీ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం కార్మికుల ఆగ్రహానికి కారణమైంది. దీనికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతోంది. విమానాశ్రయ సిబ్బంది బుధవారం విధులను బహిష్కరించగా విమానయాన సేవలు నిలిచిపోయాయి. వందల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. భారత్‌కు చెందిన అదానీ గ్రూపు ‘ఏడీఈఎల్.ఎన్’కు జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయం (జేకేఐఏ)ను 30ఏళ్ల కోసం లీజుకు ఇస్తూ కెన్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విమానాశ్రయం నవీకరణ, నిర్వహణ, అదనపు రన్‌వే నిర్మాణం వంటివి ఆ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. అయితే కెన్యా కార్మికుల ఉద్యోగాలను పణంగా పెట్టే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కెన్యా విమానాశ్రయ కార్మికుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇదే క్రమంలో సమ్మెకు పిలుపు ఇచ్చింది. చాలా మంది ఉద్యోగాలను కోత్పోతారని, ఒకవేళ ఉద్యోగాల్లో ఉన్నా అరకొర జీతానికి షరతులపై పనిచేయాల్సి వస్తుందని హెచ్చరించింది. విమానాశ్రయ సిబ్బంది గత వారమే సమ్మె చేయాల్సి ఉండగా ప్రభుత్వంలో చర్చలు పెండిరగ్‌లో ఉండటంతో వారు వెనక్కితగ్గారు. కాగా, కెన్యా మానవహక్కుల కమిషన్, లా సొసైటీ పిటిషన్ క్రమంలో అదానీ సంస్థతో ఒప్పందం అమలుపై తాత్కాలిక స్టే విధిస్తూ అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి పనులు జరగరాదని పేర్కొంది.