వాషింగ్టన్ : కోవాగ్జిన్ టీకాను అత్యవసరంగా వినియోగించడానికి అనుమతించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. టీకాకు సంబంధించి మరికొంత సమాచారం అందవలసి ఉందని పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించే ముందు దాని పనితీరు, భద్రతను పూర్తిస్థాయిలో విశ్లేషించాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ట్వీట్లో పేర్కొంది. ఈ విషయమై భారత్ బయోటెక్ డబ్ల్యూహెచ్‌వోకు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది. ‘మా నిపుణులు కోరుతున్న సమాచారాన్ని భారత్ బయోటెక్ అందజేస్తూ వస్తోంది. దానిని విశ్లేషిస్తూ అవసరమైన వివరాలు కోరుతున్నాం. ఇప్పుడు అదనంగా మరొక్క సమాచారం రావాల్సి ఉంది’ అని డబ్ల్యూహెచ్‌వో ఆ ట్వీట్లో పేర్కొంది. కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ విషయమై సాంకేతిక నిపుణుల బృందం ఈ నెల 26న సమావేశం అవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ తెలిపారు.