40 మంది మృతి
60 మందికి గాయాలు
దెయిర్ అల్ బలాప్‌ా: గాజాలో ఇజ్రాయిల్ దురాక్రమణ తీవ్రస్థాయిలో కొనసాగిస్తోంది. పలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న రక్షిత ప్రాంతంలోని శిబిరంపై మంగళవారం దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది చనిపోగా 60 మందికిగాపై గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పలస్తీనా అధికారులు వెల్లడిరచారు. హమాస్ తీవ్రవాదులను తుడిచిపెట్టే నెపంతో రక్షిత ప్రాంతాలలోనూ ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. మవాసీ (శిబిరం)లో 40 మృతదేహాలు లభ్యమైనట్లు పౌరరక్షణ వర్గాలు తెలిపాయి. గుడారాల్లో తలదాచుకునే చాలా కుటుంబాలు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడిరచాయి. ఘటనా స్థలిలో మూడు పెద్ద అగాధాలు ఏర్పడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కెమెరామెన్ పేర్కొన్నారు. ఇసుక, రాళ్లురప్పల గుండా శరణార్థులను తరలిస్తున్నట్లు వెల్లడిరచారు. పొద్దుపోయిన తర్వాత ఈ దాడి జరగడంతో సెల్‌ఫోన్ల వెలుగులో తరలింపు కొనసాగిందన్నారు. ఖాన్ యూనియన్‌లోని నసీర్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. 20కుపైగా మృతదేహాలను తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని అక్కడి సిబ్బంది తెలిపారు.
దాడి చేసింది హమాస్ కేంద్రంపైనే: ఇజ్రాయిల్
కమాండ్ ` కంట్రోల్ కేంద్రం నడుపుతున్న హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా దాడి చేశామంటూ ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. పౌర మరణాలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఏరియల్ సర్వే చేశామని సమర్థించుకుంది. 11 నెలలుగా సాగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు తాము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చుకుంది. నిర్వాసిత ప్రాంతాల్లో నక్కి ఉంటున్న హమాస్ కారణంగా పౌర మరణాలు సంభవిస్తున్నాయని, ఇందుకు ఉగ్ర సంస్థదే బాధ్యతని పేర్కొంది.
మా వాళ్లు అక్కడ లేరు: హమాస్
ఇజ్రాయిల్ ఆరోపణలను హమాస్ తోసిపుచ్చింది. దాడి జరిగిన ప్రాంతంలో తమ వారు లేరని స్పష్టంచేసింది. ఇజ్రాయిల్ తమపై నెపం నెడుతోందని పేర్కొంది.
మృతులు 40వేలకు పైమాటే: గాజా ఆరోగ్యశాఖ
ఇజ్రాయిల్ దురాక్రమణలో ఇప్పటివరకు 40వేల మందికిపైగా పలస్తీనియన్లు చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ ఒక ప్రకటన వెలువరించింది. గాజా జనాభా మొత్తం 2.3 మిలియన్లు కాగా ఇందులో 90 శాతం మంది అక్కడ నుంచి తరలిపోయారు. వేలాది మంది మావసీలో తలదాచుకుంటున్నారు. మవాసీ అంటే తీరం వెంబడి ఏర్పాటు చేసిన క్యాంపులు. శిబిరాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు సహాయక సంఘాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మానవతా జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలపైనా ఇజ్రాయిల్ దాడులకు తెగబడుతుండటంతో పరిస్థితి మరింత జఠిలమవుతోంది.