గాజా: అపరిశుభ్ర వాతావరణం కారణంగా గాజాలో పోలియో ముప్పు వేగంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్త మైన ఐక్యరాజ్యసమితి, యూనిసెఫ్ ఇతర సంస్థలు హమాస్- ఇజ్రాయిల్ యుద్ధానికి తక్షణ విరామం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఓ పోలియో కేసును అధికారులు నిర్ధరించడం వల్ల వేగంగా టీకాలు వేసి పూర్తి స్థాయి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పేర్కొన్నాయి. గాజాలో పదేళ్ల లోపు ఉన్న 6 లక్షల 40 వేల పిల్లలకు ఈ నెల చివరలో పోలియో టీకాలు వేయాలని నిర్ణయించాయి. ఇందు కోసం ఇజ్రాయిల్-హమాస్ 7 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి. గాజాలోకి 16 లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు తీసుకు రావాలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది. యుద్ధానికి ముందు 99 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందనీ, కానీ ప్రస్తుతం అది 86 శాతానికి పడిపోయినట్టు తెలిపింది. గాజాను ఇజ్రాయిల్ ముట్టడి చేసి దాడులు చేస్తుండటం వల్ల ఎక్కడకు వెళ్లాలో తెలియక వేలాది మంది ఒకే చోట గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. సెంట్రల్ సిటీ డెయిర్ అల్-బలాలో వీధులు మురుగు నీటితో నిండిపోయాయి. రోజూ పిల్లలు, పెద్దలు వీధుల్లో చెత్త కుప్పల మీదుగా నడుస్తున్నారు. మానవ వ్యర్థాలు టెంట్లకు సమీపంలోనే వేస్తుండటం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. గత నెలలో ఆరు వేర్వేరు ప్రాంతాల్లోని నీటిలో సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. మరోవైపు 7 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు హమాస్ శుక్రవారం ప్రకటించిన సంగతి విదితమే. కైరో వేదికగా ఇజ్రాయిల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై త్వరలో చర్చలు మళ్లీ మొదలవుతాయని తెలిపింది. అమెరికా ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించనున్నాయి.