అమెరికా, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో వాదన
వివాదాస్పదంగా వెనిజులా అధ్యక్షుడి ఎన్నిక
కారకస్/వాషింగ్టన్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వివాదం ముదిరింది. నికోలాస్ మదురోను వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించేందుకు అమెరికా, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ నిరాకరించాయి. ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించినది విపక్ష అభ్యర్థి ఎడ్‌మండో గోంజాల్వెజ్ అని పేర్కొన్నాయి. గోంజాల్వెజ్ గెలిచినట్లు భావించాయి. అధ్యక్ష ఎన్నికల్లో మదురో గెలిచినట్లు వెనిజులా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కానీ మదురో ఎన్నికను నిరాకరిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా సరసన బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ చేరాయి. గోంజాల్వెజ్ విజేతని పేర్కొన్నాయి. జులై 28న అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ప్రకటనలో మదురో ఎన్నికను తిరస్కరించారు. అత్యధిక ఓట్లు గోంజాల్వెజ్‌కు దక్కాయని వెనిజులా ప్రజలతో పాటు అమెరికాకు స్పష్టత లభించిందని తెలిపారు. 2013 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా మదురో ఉన్నారు. తాజా ఎన్నికల్లో 51శాతం ఓట్లతో గెలుపొందారు. ప్రతిపక్ష లెక్క ఇందుకు భిన్నంగా ఉంది. 90శాతం ఓట్లు గోంజాల్వెజ్‌కు వచ్చినట్లు తెలిపింది. మదురో కంటే ఆయనకు రెట్టింపు మద్దతు లభించినట్లు వెల్లడిరచింది. ఈ మేరకు సమగ్ర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్లకు మించి ఎలాంటి సమాచారాన్ని ప్రభుత్వం పంచుకోలేదు. దీంతో అనేక అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. పౌరులు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు, రాజకీయ హింసకు అస్త్రాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్, భద్రతా దళాలు ఉండరాదని బ్లింకెన్ పేర్కొన్నారు. తాజా వివాదం వల్ల ఓట్ల వివరాలు బహిర్గతం చేయాలని వెనిజులాకు బ్రెజిల్, మెక్సికో, కొలంబియా అధ్యక్షులు సూచించారు. మదురోకు వ్యతిరేకంగా చేసిన ప్రకటన కారణంగా పెరుతూ వెనిజులా తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆందోళనలకు విపక్ష నేత మారియా పిలుపు
వెనిజులా అధ్యక్షుడిగా మదురో తిరిగి ఎన్నిక కావడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ప్రతి నగరంలో ఆందోళనలు చేపట్టాలంటూ తమ వర్గాలకు ప్రతిపక్ష పార్టీ నేత మారియా కొరీనా మచాడో పిలుపునిచ్చారు. న్యాయంగా గెలిచింది గోంజాల్వెజ్ అని… చాలా వరకు పోలింగ్ కేంద్రాల డేటా ఇదే చెబుతున్నట్లు వెల్లడిరచారు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే…. ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చే వారంతా వెనిజులా ప్రజల న్యాయమైన పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ముదరో గెలుపుతో తన ప్రాణానికి ముప్పు ఉన్నందున అజ్ఞాతవాసంలో ఉన్నట్లు ఆమె ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత వెనిజులాలో చెలరేగిన హింసలో 20 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికిపైగా అరెస్టుకు గురైనట్లు వెల్లడిరచారు. ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపించి, వాటిని ధ్రువీకరించే ప్రక్రియను చేపట్టాలని మదురో కోరడంతో అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులందరికీ వెనిజులా అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం సమన్లు జారీచేసింది.