రిట్సోనా : ప్రపంచంలో అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, పోరాటాల్లో వేలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 65.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో 21 మిలియన్లకు పైగా శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్లారు. గ్రీస్‌లోని రిట్సోనా శరణార్థి శిబిరం నివాసితులు ఆదివారం ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో 3వేల మంది శరణార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం కెన్యాలోని దాదాబ్‌లో ఉంది. అక్కడ దాదాపు 3,29,000 మందికి పైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. దేశాల మధ్య యుద్ధాల నివారణకు, శరణార్థుల జీవన పరిస్థితులు మెరుగుదలకు తాము ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రదర్శనకు ఆప్ఘనిస్థాన్‌కు చెందిన 16ఏళ్ల బాలిక పర్వానా నాయకత్వం వహించారు. ‘మేము మా హక్కులు అడుగుతున్నాం. గోడలతో ఉన్న శిబిరాల్లో మేము ఖైదీల వలే జీవిస్తున్నాం’ అని వాపోయారు. గ్రీస్‌లోని శరణార్థి శిబిరానికి ఆమె టర్కీ నుండి పడవ ద్వారా 19 నెలల క్రితం వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా శిబిరాల నుంచి వెళ్లేందుకు అనుమతించలేదు. ‘గోడలు పగలగొట్టండి..ఉద్యమ స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు’ అన్న బ్యానర్లు చేపట్టారు. శరణార్థ్థి శిబిరాల్లో జీవన పరిస్థితుల మెరుగుదలకు యూరోపియన్ యూనియన్ సహాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వందలాదిమంది యువతకు విద్యనందించాలని విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛ, హక్కులు కల్పించాలని వేలాదిమంది నినదించారు. 2015 నుంచి పది లక్షలకు పైగా ప్రజలు గ్రీస్ చేరుకున్నారు. గ్రీస్‌లో 53వేల మంది శరణార్థులు నివసిస్తున్నారు. 66వేల మంది ఆశ్రయం కోరుతున్నారని గ్రీస్ మంత్రిత్వశాఖ వెల్లడిరచింది.100కి పైగా దేశాలు జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మిలియన్ల శరణార్థులలో 18 ఏళ్లలోపు ఉన్నవారు 51 శాతం.