చైనా`అమెరికా సంబంధాలు
చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ పిలుపు
బీజింగ్ : మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చైనా, అమెరికా దేశాలు ఉమ్మడి ప్రయోజనాలను మరింత విస్తృతం చేయాలని చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ పిలుపునిచ్చారు. అమెరికాచైనాల విదేశాంగ విధానం తప్పుదారి పట్టించే దుర్మార్గపు చర్యగా మారకుండా ఉండాలని హెచ్చరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్ చైనాకు రహస్య పర్యటన చేసిన 50వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆన్‌లైన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కిసింజర్ చైనా పర్యటన అమెరికా అప్పటి అధ్యక్షుడు నిక్సన్ చైనా పర్యటనకు, షాంఘై కమ్యూనిక్ జారీకి ప్రేరణ అయిందని వాంగ్ అభిప్రాయపడ్డారు. ఈ చర్య పాతతరం నాయకుల దౌత్యవిధానానికి నిదర్శనంగా పేర్కొన్నారు. నిక్సన్ పర్యటన చైనా
అమెరికాల మధ్య అంతర్జాతీయ రాజకీయాలకు నూతన అధ్యాయంగా పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలలో చైనాఅమెరికా సంబంధాలు రెండు దేశాలకు భారీ ప్రయోజనాలు చేకూర్చిందన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సంబంధాలు వృద్ధి చెందాయని వాంగ్ అన్నారు. చైనా అభివృద్ధి అంటే ప్రపంచానికి అవకాశాలు అందిపుచ్చుకున్నట్లేనని, చైనా, అమెరికా పరస్పర అభివృద్ధిలో మరింత భాగస్వాములు కావాలని వాంగ్ ఆకాంక్షించారు. సార్వభౌమాధికారం, భద్రత ప్రయోజనాలు.. చైనా
అమెరికాలు సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను గౌరవించాలని సంప్రదింపుల ద్వారావిభేదాలు, ఘర్షణలను పరిష్కరించుకోవాలని వాంగ్ కోరారు. ద్వైపాక్షిక సంబంధాలకు ప్రజల మద్దతును పటిష్టం చేయడానికి ప్రజలను బలోపేతం చేయాలని ఆయన రెండుదేశాలకు పిలుపునిచ్చారు. ‘అమెరికాకు అతిపెద్ద సవాలు చైనా కాదు.. అమెరికా కూడా’ అని వాంగ్ అన్నారు. మానవాళికి సుగమమైన భవిష్యత్తు కోసం అనే ఆలోచననలు రెండు దేశాలు సమర్థించినంతకాలం చైనా, అమెరికాలు వారి సమస్యలను పరిష్కరించుకుంటాయన్నారు. ఈ సందర్భంగా కిసింజర్ వీడియో లింక్ ద్వారా ప్రసంగిస్తూ 50 సంవత్సరాల క్రితం అమెరికా చైనాల మధ్య పరిచయం ఇప్పటికీ ఆచరణాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందని అన్నారు. రెండు దేశాలు వ్యూహాత్మక సమాచార మార్పిడిని మెరుగుపరచాలని, ద్వైపాక్షిక సంబంధాల విభేదాలను అధిగమించడానికి సహకారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమానికి చైనీస్ పీపుల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, అమెరికా`చైనా రిలేషన్స్ నేషనల్ కమిటీ, వివిధ రంగాలకు చెందిన 300 మందికిపైగా ప్రతినిధులు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.