న్యాయ సంస్కరణకు చట్టసభ ఆమోదం`సర్వత్రా వ్యతిరేకత
మెక్సికో సిటీ: ప్రజా ప్రతినిధులనే కాదు న్యాయమూర్తులను కూడా ప్రజలే ఎన్నుకోనేలా సంస్కరణలు చేపట్టేందుకు మెక్సికో నడుం బిగించింది. న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పూనుకుంది. జడ్జిలను ఎన్నుకునే అధికారాన్ని ప్రజలకు ఇవ్వబోయే ప్రపంచంలోని మొట్ట మొదటి దేశంగా నిలవబోతోంది. 2024లో లేక 2027లో జడ్జిలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 1,600 మంది జడ్జిలు పోటీ పడనున్నారు. అన్ని స్థాయిల్లో న్యాయమూర్తులను ఓటర్లే ఎన్నుకునే విధానానికి మెక్సికో చట్టసభ ఆమోదం లభించింది. ఈ సంస్కరణకు 86 అనుకూల, 41 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. రాజకీయ, సంపన్నుల ప్రయోజనాలకు అనుకూలంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని, దీనిని సంస్కరించడం అత్యవసరమని అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రేడార్ చెబుతుండగా బుధవారం చట్టసభను నిరసనకారులు ముట్టడిరచారు. సభను అడ్డుకున్నారు. ‘న్యాయ వ్యవస్థ కుప్పకూలబోదు’ అని నినదించారు. దీంతో సెనేట్ నాయకుడు గెరార్డో ఫెర్నాండెజ్ నొరోనా సభను కొద్ది సేపు వాయిదా వేశారు. సభ్యులంతా పాత సెనేట్ భవనంలోకి వెళ్లి తమ చర్చ ముగించారు. మరోవైపు సభ బయట ఆందోళనలు కొనసాగాయి. ‘మిస్టర్ సెనేటర్, స్టాప్ ది డిక్టేటర్’! వంటి నినాదాలు మార్మోగాయి. ఈ పరిణామాలతో దౌత్యపరంగా సమస్యలు మొదలు కాగా పెట్టుబడిదారుల్లోనూ ఆందోళన మొదలైంది. దేశంలో నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.