అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించినట్లు ట్రంప్ ప్రచార బృందం పేర్కొంది. ‘అమెరికాలో అస్థిరత, గందరగోళం సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. ట్రంప్‌నకు కచ్చితమైన ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది’ అని ఆయన ప్రచార బృందం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది. ట్రంప్‌ను రక్షించడంతో పాటు ఎన్నికలపై ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని వెల్లడిరచింది. ఈ హెచ్చరికలపై ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నా హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీసెస్‌కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. రిపబ్లికన్‌లు, డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసిరావడం ఆనందంగా ఉంది. ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే నిందితుడికి మరణమే!’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నిస్తుందని ఎఫ్‌బీఐ అధికారులు గతంలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రచారం హ్యాక్ అవడానికి ఇరాన్ కారణమని తాము భావిస్తున్నట్లు వెల్లడిరచారు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిరచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం తమకు లేదని తెలిపింది. అయితే ఇటీవల ఇరాన్ హ్యాకర్లు ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను హ్యాక్ చేసి… ఆ సారాంశాన్ని బైడెన్ ప్రచార సిబ్బందికి ఇచ్చేందుకు వారిని ఊరిస్తూ మెయిళ్లు పంపారని కొన్ని ఏజెన్సీల అధికారులు తెలిపారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌పై వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఆ వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసింది. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడిచెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది.