హారిస్
సావన్నా: దేశం కోసం కొత్త పథాన్ని ఎంచుకునేందుకు అమెరికన్లు సంసిద్ధమయ్యారని డెమొక్రాట్ పార్టీ తరపు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ అన్నారు. అధికారంలోకి వస్తే కేబినెట్‌లో రిపబ్లికన్‌కు స్థానం కల్పిస్తామని ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరిచి, కొత్త పథంలో ముందుకు సాగేందుకు అమెరికన్లు నడుంబిగించారన్నారు. గత దశాబ్దంగా ఒక అజెండా కోసం ఒత్తిడి తెస్తున్న వారు మాజీ అధ్యక్షుడు కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అధ్యక్ష అభ్యర్థిగా ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆమె ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అలాగే అక్రమ చొరబాట్లను ఉపేక్షించబోనన్నారు. ఉదారవాద విలువలను విడనాడనని చెప్పారు. తన వైఖరిలోగానీ సిద్ధాంతాలు, విలువలలోగానీ మార్పు రాబోదని నొక్కిచెప్పారు. ‘అధ్యక్షురాలిగా నేను ఫ్రాక్లింగ్‌ను నిషేధించను’ అంటూ పెన్సెల్వేనియాతో వివాదానికి తెర దించే ప్రయత్నాన్ని చేశారు. మెక్సికన్ సరిహద్దు వెంబడి చొరబాట్ల విషయంలో కమలా హారిస్ ఉదారంగా ఉంటారన్న ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అధ్యక్షరాలిగా కఠిన చట్టాన్ని అమల్లోకి తెస్తానని ఆమె నొక్కిచెప్పారు. గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్‌కు సంబంధించి దేశాధ్యక్షుడు జోబైడెన్ అనుసరించే విధానాల్లో ఎటువంటి మార్పు ఉండబోదని కూడా కమలా హారిస్ స్పష్టంచేశారు.